ప్రజాశక్తి - కొత్తచెరువు : రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని బిజెపి ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ అన్నారు. సోమవారం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి సంబందించిన కరపత్రాలను స్థానిక బస్టాండ్ కూడలిలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉక్కు ఫ్యాక్టరీని రాయలసీమలో ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిత్యానంద రారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అవసరం లేదని తేల్చి చెప్పారని అన్నారు ఇందుకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి సానుకూలంగా ఉన్నాయన్నారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకించడంలో ఈ పార్టీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైసిపి నుండి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా వాటిని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సోమవారం నిర్వహించే కలెక్టరేట్ వద్ద ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గంగాధర్, నాయకులు రామాంజనేయులు, నాగేంద్ర ,పెద్దన్న తదితరులు పాల్గొన్నారు
పుట్టపర్తి అర్బన్ : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలు, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సీమకు ద్రోహం చేసిందన్నారు. బిజెపి తన రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే సీమ అభివృద్ధితో పాటు వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.










