ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకూ పోరాటం ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్
కడప అర్బన్ : జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకు పోరాటం నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాధనకై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఫస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్సు సమృద్ధిగా ఉన్నాయని కేంద్రం స్టీల్ అథారిటీ పరిశోధనలు చేసి, నివేదిక గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఆధారంగానే 2007లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'బ్రాహ్మణి స్టీల్' నిర్మాణానికి జమ్మలమడుగు మండలం, చిటిమిటి చింతలలో శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. 2018 డిసెంబర్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2019లో కన్యతీర్థం వద్ద జగన్మో హన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకమారు, 2023లో ఫిబ్రవరి నెలలో మరో మారు శంకుస్థాపనలు చేసి ప్రయివేట్ కంపెనీలకు ఇచ్చిన విషయాన్ని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఉన్న మెండుగా అవకాశాలను దష్టిలో పెట్టుకొని బిజెపి కేంద్ర, రాష్ట్ర కమిటీలు కర్నూలు డిక్లరేషన్‌పేరుతో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేస్తామని బహిరంగ తీర్మాన ప్రకటన చేశారన్నారు. ఈనెల జులై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ నూతన బిజెపి అధ్యక్షురాలుగా ఎన్నికైన పురంధేశ్వరిదేవి కర్నూల్, కడపలో సభలు పెట్టి బిజెపి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని కట్టుబడి ఉందని చెప్పిన నాలుగవ రోజే పార్లమెంటులో బిజెపి హోమ్‌శాఖ సహాయ మంత్రి కడప ఉక్కు లాభదాయకం కాదని చెప్పటం బిజెపి రెండు నాలుకల ధోరణికి, డబల్ ఇంజిన్ విధానానికి నిదర్శనం అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తానని బిజెపి ఎన్నికల ముందు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి, అధికారంలోకి రాగానే మొండి చేయి చూపించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి బిజెపి చేసిన మోసం ప్రశ్నించకుండా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ముద్దుబిడ్డలుగా ప్రవర్తిస్తున్నాయని వాపోయారు. వైసిపి జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని ఊరిస్తున్నారని, 30 నెలల్లో జిందాల్ ప్రయివేట్ కంపెనీ మొదటిదశ ఉక్కు పరిశ్రమ ప్లాంట్ పూర్తవుతుందని చెప్పి, నేటికీ ఆరు నెలలు గడిచిపోయిందని, శంకుస్థాపన చేసిన స్థలంలో కనీసం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించలేదని చెప్పారు. సెయిల్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకు కలిసి వచ్చే పార్టీలు సంఘాలు ప్రగతిశీల భావాలు ఉన్న మేధావులతో కలసి సిపిఎం ఉద్యమం కొనసాగిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.శివకుమార్, ఏ.రామ్మోహన్, బి.మనోహర్, ఐ.ఎం.సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు, వి.అన్వేష్, కే.సత్యనారాయణ, బి.దస్తగిరి రెడ్డి, కె.శ్రీనివాసులు రెడ్డి, ఎం.పాపిరెడ్డి, సిపిఎం నాయకులు ఎన్ .భైరవ ప్రసాద్, ఎన్ .వీరయ్య, శివనారాయణ, నరసయ్య, శివ, చిన్ని , రాజేంద్ర , చాంద్ భాష, ముంతాజ్ బేగం, జమీల, గౌసియా, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.










