Jul 25,2022 00:16

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

ప్రజాశక్తి - ఉక్కునగరం
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ బారి నుంచి కాపాడుకోవడానికి మున్ముందు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు జె.అయోధ్యరామ్‌, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ తెలిపారు. ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 528వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ వివిధ విభాగాల కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. వారిని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, స్థానిక స్టీల్‌ యాజమాన్యం కలిసి స్టీల్‌పాంట్‌లో ఉత్పత్తిని కావాలనే తగ్గించి నష్టాల బారిన పడేలా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రలు కార్మికవర్గం ముందు సాగబోవన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 9న 'క్విట్‌ ఇండియా' ఉద్యమ స్ఫూర్తితో విశాఖ నగరంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
అలాగే దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల దీక్ష చేపట్టనున్నామన్నారు. దీక్షా శిబిరంలో పోరాట కమిటీ నాయకులు రమణమూర్తి, బి.అప్పారావు, వి.ప్రసాద్‌, నమ్మి రమణ, కొవిరి అవతారం, మంత్రి నగేష్‌, భాస్కరరావు, బైరెడ్డి అప్పారావు పాల్గొన్నారు.