ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలే నిరాహార దీక్షలు 900 రోజులకు సమీపిస్తున్న సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంఘీభావంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులను స్టీల్‌ప్లాంట్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరపున వినతి పత్రాన్ని సమర్పించామని అయోధ్యరామ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పార్లమెంట్లో ప్రశ్నించారని చెప్పారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి అండగా నిలబడి సంఘీభావంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎస్.పవన్, సీర రమేష్, కెఎం.రాజు, శీతల్ మదన్ పాల్గొన్నారు.










