Sep 30,2023 21:20

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శిరెడ్డివేణు తదితరులు

ప్రజాశక్తి - కురుపాం :  విశాఖ ఉక్కు రక్షణకై అక్టోబర్‌ 5న చలో స్టీల్‌ ప్లాంట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కురుపాంలో ఆయన గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే 950 రోజులుగా దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా సిపిఎం ఉత్తరాంధ్రాలో బైక్‌ యాత్ర చేపట్టి దీని ముగింపుగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దగ్గర కూర్మం పాలెంలో అక్టోబర్‌ 5న బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని, ఈ సభలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ కార్యదర్శి మండంగి శ్రీను, నాయకులు కె.సీతారాం, పువ్వుల పత్తి, తిరుపతిరావు, జి.సోమయ్య, కె.బలరాం పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్‌ : విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ అక్టోబర్‌ 5న విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం వద్ద గల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద జరిగే బహిరంగ సభలో ప్రజలంతా పాల్గొనాలని సిపిఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు పట్టణ ప్రధాన రహదారిలో గల వ్యాపార వర్గాలకు, కార్మికులకు శనివారం కరపత్రాలు పంపిణీ చేశారు.
గరుగుబిల్లి : విశాఖ స్టీల్‌ పరిరక్షణకై అక్టోబర్‌ 5న విశాఖలో జరిగే బహిరగసభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు మండలంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగసభకు సంబంధించిన కరపత్రాలను మండలంలోని వివిధ గ్రామాల్లో పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర, దాసరి వెంకట నాయుడు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు అక్టోబర్‌ 5 న విశాఖపట్నం లో జరిగే బహిరంగ సభకు భారీగా ప్రజలు వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు కూనేరు సంతలో బహిరంగ సభను పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బాగిలి నరేష్‌, రవి వెంకటేష్‌, సోమరాజు జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.