Nov 09,2022 23:21

నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌: విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం, ఆధ్వర్యంలో అరకువేలి డిగ్రీ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. మోడీ గో బ్యాక్‌ అని పెద్ద ఎత్తున నినదాలు చేశారు. అనంతరం గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న మాట్లాడుతూ,ప్రత్యేక హౌదా, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రధాని తీవ్రంగా ద్రోహం చేశారన్నారు. విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసి విశాఖపట్నం పర్యటించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ వంటి స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఉప సంహరించుకోవాలని తెలిపారు. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మడం ఎంతవరకు సమంజసమన్నారు. జీవో 3ను పునరుద్ధరణ చేసి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు కె.సిమోన్‌, పి.కృష్ణ, జి.కార్తీక్‌, జి.హరి, ఎస్‌.సింగ్‌, రవి ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.