వంద రోజుల పోరాటం అంటే సినిమా శత దినోత్సవం లాంటిది కాదు. సంబరాలు జరుపుకునే శుభ సందర్భం అంతకంటే కాదు. అడుగడుగునా దీక్ష, పట్టుదలతో సాగిన సమరశీల పోరాటం ఇది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం అంటే కేంద్ర ప్రభుత్వంతో ఢ కొట్టడం. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని సవాల్ చేసి ఎదుర్కోవడం. వంద రోజుల పోరాటం సునాయాసంగా సాగటానికి కారణం యావత్తు కార్మికుల దన్ను, మద్దతు వుండడమే ప్రధానం.
విశాఖ స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి నేటికి నూరు రోజులైంది. కఠోరమైన కరోనా కాలంలో కూడా నియమాలు పాటిస్తూ నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నేటికి సుమారు వంద మందికి పైగా కార్మికులు, అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులతో సహా కరోనా మహమ్మారికి బలయ్యారు. విశాఖ నగరంలోనూ, రాష్ట్రంలో అనేక చోట్ల వివిధ కార్యక్రమాలు అప్రతిహతంగా నేటికీ సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 21న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం వాటాలను ప్రైవేటీకరించాలని దుర్మార్గమైన నిర్ణయం చేసింది. దీనికి నిరసనగా ఫిబ్రవరి 12 నుంచి నేటి వరకు భారీ నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 18న స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన భారీ కార్యక్రమానికి అశేష మద్దతు లభించింది. అన్ని రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ముక్తకంఠంతో ఖండించాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలతో 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ' ఏర్పడింది. ఈ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకు బిజెపి మినహా అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదికపై కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటానికి మద్దతు ఇవ్వడం అపూర్వం. ఏప్రిల్ 18న విశాఖ బీచ్ వద్ద జరిగిన రైతు, కార్మిక శంఖారావం ఒక చారిత్రిక ఘట్టం. అఖిల భారత రైతు నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతు పలికారు. స్వాతంత్య్రానంతరం కార్మిక, కర్షక మైత్రిని చాటే పోరాటంగా మలుచుకున్న చరిత్ర విశాఖ ఉక్కు పోరాటానికే దక్కింది. మార్చి 20న అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులంతా బిఎంఎస్ తో సహా వచ్చి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతిచ్చారు. ఫిబ్రవరి 18 నుంచి ప్రతి వారం భారీ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి కార్యక్రమానికి పది వేల మందికి తక్కువ కాకుండా హాజరయ్యారు. మార్చి 5న, మార్చి 26న ఒకే నెలలో రెండుసార్లు బంద్‌లు జయప్రదంగా జరగడం ఈ పోరాటం విశిష్టత. రాష్ట్రవ్యాపిత 'రాస్తా రోకో', విద్యార్ధి, యువకుల మార్చ్ (పాత గాజువాక), విశాఖ బీచ్ వాక్, విశాఖ స్టీల్ అడ్మిన్ ముట్టడితో సహా అన్ని పిలుపులు జయప్రదం కావడం ఈ పోరాటం ప్రత్యేకత. వంద రోజుల పోరాటం అంటే సినిమా శత దినోత్సవం లాంటిది కాదు. సంబరాలు జరుపుకునే శుభ సందర్భం అంతకంటే కాదు. అడుగడుగునా దీక్ష, పట్టుదలతో సాగిన సమరశీల పోరాటం ఇది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం అంటే కేంద్ర ప్రభుత్వంతో ఢ కొట్టడం. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని సవాల్ చేసి ఎదుర్కోవడం. వంద రోజుల పోరాటం సునాయాసంగా సాగటానికి కారణం యావత్తు కార్మికుల దన్ను, మద్దతు వుండడమే ప్రధానం. యావత్ భారత దేశం, రాష్ట్రం ఒక్కటై ఈ పోరాటానికి మద్దతు పలికాయి. రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలు (బిజెపి మినహా) ఒకే తాటి పైకి వచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మే 20న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
కరోనా కాలంలో కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి 9 వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయడం ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏకైక సమస్య సొంత ఇనుప ఖనిజం లేకపోవడమే. దేశం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్టీల్‌ప్లాంట్లకు సొంత ఇనుప ఖనిజ గనులున్నాయి. విదేశీ దక్షిణ కొరియాకు చెందిన 'పోస్కో' కంపెనీకి కూడా ఒడిశాలో సొంత గనులున్నాయి. అత్యంత నాణ్యమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వకపోవడం రాజకీయ కుట్ర. గత కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, నేటి బిజెపి గానీ విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయించకపోవడానికి, ప్రైవేటీకరించాలన్న మొండి పట్టుదలే ప్రధాన కారణం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రారంభంలో ఇచ్చిన రూ. 5 వేల కోట్లు తప్ప ఏనాడూ కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయలేదు. స్టీల్‌ప్లాంట్ నిధులను దారిమళ్లించి రూ.1500 కోట్లతో ఉత్తరప్రదేశ్ లోని రారుబరేలిలో రైల్ వీల్ ప్లాంట్‌ను స్థాపించారు. రూ.360 కోట్లు ఒడిశాలో ఇనుప ముడి ఖనిజం కోసం ఖర్చు పెట్టించి నేటికీ ఒక టన్ను కూడా ముడి ఖనిజం తీసుకు రాలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎస్‌ఆర్ నిధులతో ఇతర రాష్ట్రాల్లో ఐటిఐ సహా అనేక సంస్థలను ఏర్పాటు చేశారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారం లోకి వచ్చిన తరువాత కార్పొరేట్ అనుకూల విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరిస్తామని, లేదంటే మూసివేస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రకటించారు. మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో చేసినవే. నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులను బానిసలుగా మార్చి పని చేయించుకొనే లక్ష్యంతో చేసినవే. ఇవన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను అవలంభించడంలో భాగమే. అందుకే ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు బిజెపి కి తగిన గుణపాఠం చెప్పాయి. రెండో దశ కరోనాను అరికట్టడంలో బిజెపి ఘోరంగా వైఫల్యం చెందిందని ప్రపంచం యావత్తూ, మీడియా మోడీని వేలిత్తి చూపించింది. కరోనా వైఫల్యాలకు తోడు కార్పొరేట్లకు అనుకూలంగా అవలంభించిన విధానాల ఫలితంగానే ప్రధాని ప్రత్యక్షంగా ప్రచారం చేసినా బెంగాల్‌లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. కేరళలో వున్న రెండు స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. ప్రజల తీర్పును గుర్తించి బిజెపి తన విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో కార్మిక, కర్షక పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరిస్తున్నాం.
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు /
సిహెచ్. నర్సింగరావు











