Jan 20,2023 23:43

నినాదాలు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి- కె.కోటపాడు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని కోరుతూ ప్రజా సంఘాలు, కెవిపిఎస్‌, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం మరిడిమాంబ అమ్మవారి తీర్థంలో సంతకాల సేకరణ చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేవాడు ఎవడు, కొనేవాడు ఎవడు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు నాటి కేంద్ర ప్రభుత్వం రూ.6వేల కోట్లు ఇవ్వగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టీల్‌ప్లాంట్‌ రూ.59 కోట్లు డివిడెంట్‌ రూపంలో చెల్లిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కావలసిన ఇనుప గనులు ఇవ్వకుండా, నష్టాలు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, అదాని తదితర కార్పొరేట్‌ సంస్థలకు దేశ ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబట్టే కుట్ర చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మూల పరిశ్రమ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా అందరం కలిసికట్టుగా ఉద్యమించి కాపాడుకోవాల్సిన అవసరం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు గాడి ప్రసాదు, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు ఆర్‌.వెంకట్రావు, రెడ్డి శ్రీనివాస్‌, పిఎ.భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.