Oct 31,2023 23:51

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంగళవారం అల్లూరి సీతారామరాజు భవనంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ఈ నెల 8వ తేదీన కేజీ టు పీజీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌జె.నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష కార్మిక, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల జెఎసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, సిఐటియు నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఐఎన్‌టియుసి నాయకులు భోగవిల్లి నాగభూషణం, అరుణోదయ నాయకులు కె.నిర్మల, ఐద్వా నాయకులు జి.ప్రియాంక, ఎపి పిఎన్‌ఎం నాయకులు చిరంజీవి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన ఈ రాష్ట్ర స్థాయి విద్యాసంస్థల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 32 మంది ప్రాణ బలిదానం, 22 వేల ఎకరాల విస్తీర్ణంలో కేవలం రూ.4,800 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రూ.54 వేల కోట్లు వివిధ పన్నుల రూపంలో తిరిగి చెల్లించిందని తెలిపారు. 32 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులకు సామర్ధ్యాన్ని పెంచుకొని, నేడు మూడు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులతో, లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కారు చౌకగా అదాని, అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఈ బంద్‌ ద్వారా విద్యార్థి, యువజనల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, ఈ క్రమంలో తమ సంఘాల నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని వారు భరోసాఇచ్చారు. బంద్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3న బైక్‌ యాత్ర నిర్వహిస్తామని, ఈ కాలంలో ప్రతి విద్యాసంస్థను కలిసి బంద్‌ నోటీసులు ఇస్తూ, విద్యార్థులకు బంద్‌ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమం ఉంటుందని ఎల్‌జె.నాయుడు తెలిపారు. దీనికి కార్మిక ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించినందుకుకృతజ్ఞతలు తెలిపారు. విద్యాసంస్థలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు జాన్సన్‌ బాబు, సుబ్బారావు (ఎఐవైఎఫ్‌), విశ్వనాధ్‌ (పిడిఎస్‌ఒ), అభిశ్రీ (పిడిఎస్‌యు), యు.నాగరాజు (ఎఐఎస్‌ఎఫ్‌), యుఎస్‌ఎన్‌.రాజు (డివైఎఫ్‌ఐ), కె.సంతోష్‌, శ్రావణ్‌, అనీల్‌, కోటి తదితరులు పాల్గొన్నారు.