Aug 26,2022 23:12

పోలీసులు గృహనిర్బంధం చేసిన పోరాట కమిటీ నేతలు అయోధ్యరాం, ఆదినారాయణ

సిఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
ప్రజాశక్తి-ఉక్కునగరం       ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జె.అయోధ్యరామ్‌, పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి జగన్‌ ఈ పోరాటానికి మద్దతుతెలుపుతారని కార్మికులు ఎదురుచూస్తున్నారని, కానీ ఇలా గృహ నిర్బంధాలకు పాల్పడడం దారుణమన్నారు.ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
సిపిఎం, సిఐటియు ఖండన
ఉక్కునగరం : ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ప్రయివేటీకరణ కోరల్లోంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం 562 రోజులుగా అకుంఠిత దీక్షలు చేస్తున్న కార్మికసంఘాలకు సంఘీభావం తెలపాల్సిన సిఎం జగన్‌, విశాఖ వచ్చిన సందర్భంగా పోరాట కమిటీ నాయకులను గృహనిర్బంధం చేయం దుర్మార్గమని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, సిపిఎం తీవ్రంగా ఖండించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఆపని చేయకపోగా, పోరాడుతున్న కార్మిక సంఘాల నేతలను హౌస్‌ అరెస్టు చేయించడం దారుణమన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను ఆమోదించి, అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడకు వెళ్ళినా ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంతో పోరాడాలని డిమాండ్‌ చేసారు.
అంతిమ సంస్కారాలకు వెళుతున్నానని చెప్పినా ...
విశాఖపట్నం :సిపిఎం నగర్‌ నాయకుడు ఆర్‌పి.రాజు హఠాన్మరణంతో తీవ్ర విషాదం, దిగ్భ్రాంతిలో ఉండి, అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పినా వినకుండా ఆ పార్టీ మధురవాడ జోన్‌ నాయకుడు పి.రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని సిపిఎం మధురవాడ జోన్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం, ఇతర వామపక్ష నేతలను సిఎం జగన్‌ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ, అన్నిచోట్లా ఇలా ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకోవాలని సూచించారు.
పిఎం పాలెం పోలీసుల అదుపులో సిపిఎం నేత రాజ్‌కుమార్‌