Jul 09,2023 21:40

జమ్మలమడుగు : ఒబెరారు హోటల్‌ నిర్మాణ భూమిపూజలో సిఎం జగన్‌

 ప్రజాశక్తి-జమ్మలమడుగురూరల్‌/పులివెందుల టౌన్‌/రూరల్‌
ఉక్కు పరిశ్రమ పనులను మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం జమ్మలమడుగు పులివెందుల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఒబెరారు హోటల్‌ నిర్మాణానికి సిఎం ఒబెరారు గ్రూపు సిఇఒ విక్రమ్‌సింగ్‌ ఒబెరారుతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం గండికోటతో పాటు తిరుపతి, విశాఖపట్నం జిల్లా భీమిలీ మండలం అన్నవరంలో కూడా ఒబెరారు గ్రూపు నిర్మించే 7 స్టార్‌ సౌకర్యాలు గల లగ్జరీ రిసార్ట్స్‌ నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన శిలాఫలకాలను సిఎం ఆవిష్కరించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.142.37 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మా ట్లాడుతూ జిందాల్‌తో ఈ ఏడాదిలోనే ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు ఈ నెల 15 తర్వాత ఉక్కు పరిశ్రమకు పర్యావరణ అనుమలు రాను న్నాయన్నారు. ఆ తర్వాత పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు. ఉక్కు పరిశ్రమ, ఒబెరారు వంటివి జిల్లా రావడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. గండికోటలో ఒబెరారు ఇలాంటి రిసార్ట్స్‌తో పాటు మరో రిసార్ట్స్‌ కోసం పరిశీలన చేస్తున్నామని తెలిపారు. త్వరలో గండికోటలో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కడప నగర సమీపంపలోని కొప్పర్తిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్కడ కూడా మరో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం దక్కుతుందన్నారు. ఉద్యోగాల విషయంలో స్థానికులు ఇబ్బంది పడవద్దని కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తొలగిపోతాయని సభాముఖంగా తన ప్రతినిధులకు తెలిపారు. కడప జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారిశ్రామిక వేత్తలకు మనం ఎంత సహకారం అందిస్తే జిల్లా ప్రతిష్ట పెరిగుతుందన్నారు. ఎక్కువ పరిశ్రమలు జిల్లాకు వచ్చి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారని తెలిపారు. ఒబెరారు గ్రూపు సిఇఒ విక్రమ్‌సింగ్‌ ఒబెరారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా, టూరిజం డెవల్మెంట్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్‌, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎపిటిడిసి చైర్మన్‌ వరప్రసాద్‌, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్‌పి అన్బురాజన్‌, ఒబెరారు గ్రూప్‌ పిసిఒ ప్రెసిడెంట్‌ శంకర్‌, కడప మేయర్‌ సురేష్‌ బాబు, గండికోట సర్పంచ్‌ గురుఈశ్వర్‌, వివిధ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
రూ.142.37 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.142.37 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. రూ.3.25 కోట్లతో నిర్మించిన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనాన్ని ప్రారంభించారు. రూ.16.18 కోట్లతో అభివృద్ధి చేసిన పులివెందుల సిటీ ఫారెస్ట్‌ (రాణి తోపు), రూ.39.00 కోట్లతో అభివృద్ధి చేసిన గరండాల రివర్‌ ఫ్రెంట్‌ (పేస్‌-1 ) గార్డెన్‌, రూ.32.82 కోట్లతో అధునాతన వసతులతో 8 ఎకరాల్లో నిర్మించిన వైఎస్‌ఆర్‌ ఐఎస్‌టిఎ ఇంటిగ్రేటెడ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అకాడమీకి, రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన టెక్‌ బయో సైన్సెస్‌ను, రూ.26.12 కోట్లతో 12.86 ఎకరాల్లో 12 రకాల క్రీడాంశాలకు సంబంధించిన వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ అకాడమీని సిఎం ప్రారంభించారు. జెసి గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, పాడా ఒఎస్‌డి అనిల్‌కుమార్‌రెడ్డి, సిఎం వ్యక్తిగత కార్యదర్శి దనుంజయరెడ్డి, ఒఎస్‌డి కృష్ణమోహన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్‌, నూ టేక్‌ ఎండి ప్రతాప్‌రెడ్డి, ఏపీ కార్ల్‌ సీఈవో రమణా రెడ్డి పాల్గొన్నారు.