పొద్దు పుట్టాక
పరితపిస్తూ
బతుకు చక్రాలు
అనుబంధమై తిరిగేవి
కండలు కరిగితే తప్ప
కలలు సాకారమై
కళ్ళముందుకు నడిచేవి
ఊరిస్తున్న ఉపాధికి
గండి కొడుతూ
విశాఖ నగరంపై
గద్దలు వాలిన
చప్పుడు గుప్పుగా వ్యాపించింది
విశాఖ ఇప్పుడు
కన్నీటి కొలనుల చౌరస్తా
పిడికిలి బిగిస్తే తప్ప
చైతన్యం షురూ కాక తప్పదు
పొదుగు ఎండి పోయిందని
ఆవును ఏ కర్షకుడూ అమ్ముకోడు
మరి పాలకుడు?
కనికట్టు చేసి, నష్టాలను చూపి
పెత్తనంతో గారడీలు చేసి
అడ్డదిడ్డంగా అమ్మేస్తాడు
ఉరికే జలపాతంలా
అడుగుల్ని కదపాలి
చరిత్రలో కనుమరుగు అవుతున్న
విశాఖ ఉక్కును కాపాడి
మన కనుపాపల్లో దాచుకోవాలి
అన్నీ అమ్మేసుకొంటూ పోదాం అనే
అహంకారపు పాలకుల కళ్ళని
తెరిపించాలి
ఉక్కు మన హక్కంటూ
ఉక్కు పిడికిళ్లతో
ఉప్పెనలా నినదించి నిలదీయాలి...!!
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415