ప్రముఖ హైకోర్టు న్యాయవాది కోటేశ్వరరావు
ప్రజాశక్తి- గాజువాక : ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా, స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారుణమని నిర్వాసితుల పక్షాన హైకోర్టులో కేసు వాదిస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది వై.కోటేశ్వరరావు అన్నారు. ఈ నెల 21న ఇదే కేసుపై వాదనలు జరగనున్న నేపథ్యంలో శనివారం కోటేశ్వరరావు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం అగనంపూడి పరిసర ప్రాంతాల్లోని పాత అగనంపూడి, కర్ణవానిపాలెం తదితర ప్రాంతాల్లోని ఉక్కు భూములను సందర్శించి, పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భావానికి త్యాగం చేసిన నిర్వాసితులను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. నాలుగు దశాభ్దాలు గడుస్తున్నా వీరి సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధినిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను ఏకపక్షంగా ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటంలో గుంటూరులో విద్యార్థిగా ఉన్న సమయంలో తానూ పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లానని, ఇపుడు ఒక న్యాయవాదిగా కాకుండా, స్టీల్‌ప్లాంట్ ఆవిర్భావానికి ఉద్యమించిన కార్యకర్తగా కేసును చాలెంజింగ్‌గా తీసుకుని వాదిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పలువుఉ నిర్వాసిత మహిళలు, ప్రజలు తమ గోడును న్యాయవాదుల బృందానికి మొరపెట్టుకుంది. ఆర్ కార్డులు ఇచ్చినా, ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలంగానీ, కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వలేదని పలువురు విన్నవించారు. కార్యక్రమంలో ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ప్రతినిధులు పితాని భాస్కరరావు, ఉమ్ముడి అప్పారావు, డివిఎస్ నర్సింగరావు, గళ్ళ రామకృష్ణ, గుంతిన వెంకటలక్ష్మి, బలిరెడ్డి సోమినాయుడు, కరణం జగదీష్, విందుల చిర్రాజు, గెద్దాడ చిన్నారావు, మేడిశెట్టి వెంకటేష,్ రామారావు, చిన్నారావు, కాయల నరసింహారావు, నెల్లి చిన్నారావు, పినబాల శీను, పెనబాల నూకరాజు, పినబాల ప్రవీణ్ రాజు, గళ్ళ చందర్రావు, వై వెంకటరమణ, కరణం అప్పారావ,ు కరణం పైడ్రాజు, ఉక్కు నిర్వాసితులు పాల్గొన్నారు.










