సిఐటియు, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి-ఉక్కునగరం : సెయిల్ కార్మికుల వలె విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు కూడా దీపావళికి ముందే పూర్తి బోనస్ చెల్లించాలని స్టీల్ సిఐటియు కార్యదర్శి యు.రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. బోనస్‌పై యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు నినదించారు.
ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, స్టీల్ గుర్తింపు యూనియన్ అసమర్థ నిర్ణయాల వల్ల సెయిల్ కార్మికులు తీసుకుంటున్న బోనస్‌ను ు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు పొందలేకున్నారన్నారు. రూ. 3495 కోట్ల నష్టాల్లో ఉన్నప్పటికీ సెయిల్ కార్మికుల వలె పూర్తి బోనస్ చెల్లించిన ఘనత సిఐటియు మిత్రపక్షాలకు ఉందని ఆయన గుర్తు చేశారు. నేడు రూ.650 కోట్ల లాభాలు ఉన్నప్పటికీ, పూర్తి బోనస్ చెల్లించేలా యాజమాన్యంపై ఒత్తిడి చేయడంలో గుర్తింపు యూనియన్ వైఫల్యం కనబడుతోందన్నారు. బోనస్ విషయంలో విఫలమైతే, దాని ప్రభావం మున్ముందు నూతన వేతన ఒప్పంద సమయంలో తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తెరిగి, బేషజాలకు పోకుండా ఐక్యకార్యాచరణతో యాజమాన్యంపై పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్, సిఐటియు మిత్రపక్షాల నాయకులు సిహెచ్ సన్యాసిరావు, కర్ర ప్రకాష్, సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, టివికె.రాజు, ఎంఎస్‌వి ఉమామహేశ్వరరావు, విడివి పూర్ణచంద్రరావు, లోకేష్, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.










