Jul 25,2023 20:59

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సిఎం (ఫైల్‌ఫొటో)

కడప ప్రతినిధి : కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ బుట్టదాఖలైంది. 20 14లో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యుపిఎ -2 సర్కారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్ర మను ఏర్పాటు చేయాలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పలు రకాల సర్వేలు, టాస్క్‌ ఫోర్స్‌ల పేరుతో అధ్యయ నాలు చేయించింది. ఇటువంటి పరిస్థితుల నేప థ్యంలో మంగళవారం పార్లమెంటులో టిడిపికి చెందిన ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి నిత్యానందరారు సర్వే సంస్థలు లాభసాటి కాదని తేల్చాయని, ఉక్కు పరిశ్ర మను ఏర్పాటు చేయడం కుదరదని కుండబద్దలు కొట్టి నట్లు సమాధానం చెప్పడం విస్మయాన్ని కలిగి ంచింది. ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్‌ ప్రయివేటు రంగంలో బ్రహ్మణీ పేరుతో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. సుమారు 20 నుంచి 40 శాతం మేరకు పనులు పూర్తి చేశారు. 2009 అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మృతి చెందారు. వివిధ రకాల కారణాలతో బ్రహ్మణీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం నిలిచిపోయింది. రాష్ట్ర నాయకత్వ బాధ్య తలు మారడంతో బ్రహ్మణీ పరిశ్రమ కథ కంచికి చేరింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రధానాంశాలుగా మారడం తెలిసిందే. అప్పటి టిడిపి సర్కారు నిర్లక్ష్యం వెరసి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసిపి సర్కారు అధికారంలోకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్య మంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ ఉక్కు దిగ్గజ సంస్థ జెఎస్‌డబ్య్లు ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖా సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశంలోని ప్రయివేటు, కార్పొరేట్లకు లాభసాటిగా కనిపించిన ఇనుప ఖనిజం ఎగు మతులు, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సెయిల్‌కు ఎందుకు లాభసాటిగా కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. కేంద్రంలో బిజెపి పభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సర్కారు ద్రోహపూరిత వైఖరి పట్ల ప్రజానీకం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.