Sep 09,2023 23:39

సిఎం నివాసం ఉండే ప్రాంతంలోని సెంటర్‌

ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లి పట్టణం సిఎం నివాసం ఉండే ప్రాంతం.. ప్రతిరోజూ వందల సంఖ్యలో విఐపిలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. స్పందన తమ గోడు వెళ్లబోసుకోవడానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కాంట్రాక్టు లెక్చరర్లు, అసంఘటిత రంగ కార్మిులు, నిరుద్యోగులు తరలివస్తుంటారు. సామాజిక పింఛన్లు రాలేదని, సిఎం దగ్గరకు వెళ్లి అర్జీ ఇస్తే (తమ సొంత ఆస్తులు) తగాదాలు పరిష్కారం అవుతాయని, నిత్యం వందలాదిగా తాడేపల్లి వస్తుంటారు. వీరంతా ఒకటి రెండు రోజులు ఉండే విధంగా కొందరు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్రాంతానికి వస్తున్నారు. బైపాస్‌రోడ్డు నుంచి సిఎం ఇంటి వరకు ఇటీవల వ్యాపార సంస్థలు కూడా పెరిగాయి. వ్యాపార లావాదేవీలు, సరుకుల కొనుగోలు కోసం నిత్యం సుమారు రెండు నుంచి మూడు వేల మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు.
ఇంత పెద్దఎత్తున ప్రజలు ఈ ప్రాంతానికి తరలివస్తున్నా వారికి కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లేమీ చేయలేదు. ఫలితంగా కొంతమంది విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్నారు. మహిళల బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌ అధికారులు చొరవ తీసుకుని దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వచ్చిన కాంట్రాక్టు లెక్చరర్లు ఇటీవల దాతలు నిర్మించిన కర్మకాండల షెడ్డును ఉపయోగించుకుని, తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిని సేద తీరారు. తరువాత అసలు సమస్య వచ్చే సరికి గంటల తరబడి 'ఉగ్గపట్టాల్సి' వచ్చింది. ఎలాగొలా ఉందామనుకుంటే సిఎం ఇంటి సమీపంలో గుంపులుగా ఉండకూడదని చెప్పి అక్కడ నుంచి తరిమివేశారు. తమ సమస్యలు పరిష్కారానికి వస్తే సమస్య పరిష్కారం కాక తాము మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని దూర ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన వారు వాపోతున్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు కూడా గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీ రాయడానికి నీడ కల్పించడంతో పాటు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని స్థానికులతో పాటు బాధితులు కోరుతున్నారు.