Mar 21,2023 21:14

కొనుగోలు చేస్తున్న దృశ్యం

ఉగాదికి ధరాఘాతం
- పెరిగిన ధరలతో సామాన్యుల బెంబేలు
- పండగ పూట బక్ష భోజనం కష్టమే
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

       ఉగాదికి సామాన్యులకు ధరాఘాతం తప్పడం లేదు. పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పండగ పూట బక్ష భోజనం కష్టంగా మారింది. చాలా మంది ఉన్న దాంట్లోనే సర్దుకుని పండగను చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది...
తెలుగు పండగల్లో తొలి పండగ తెలుగు సంవత్సరాది ఉగాది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ పండగ సందడిగా ఉండేది. సామాన్యులకు ఈ ఉగాదికి ధరాఘాతం తప్పడం లేదు. ఉగాది ప్రత్యేకంగా జిల్లాలో చాలా మంది బక్షాలను చేసుకుంటారు. నిత్యావసర ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులకు పండగ పూట బక్ష భోజనం కష్టంగా మారనుంది. బక్షాలకు ప్రధానంగా నూనె, బెల్లం, శనగలు, మైదాను ఉపయోగిస్తారు. లీటర్‌ పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.120, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.140 నుంచి రూ.170 వరకూ పలుకుతోంది. ఇతర సరుకుల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కర్నూలు నగరంలో కిలో శనగ బ్యాళ్లు రూ.80, మొదటి రకం బెల్లం రూ.80, రెండో రకం బెల్లం రూ.55గా ఉన్నాయి. ఆదోనిలో కిలో శనగ బ్యాళ్లు రూ.100 నుంచి రూ.130, బెల్లం రూ.50, మైదా రూ.40కు అమ్ముతున్నారు. నందికొట్కూరులో కిలో శనగ బ్యాళ్లు రూ.90, బెల్లం రూ.60 నుంచి రూ.70, మైదా రూ.65కు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటిలో బక్షాలు చేసుకోవాలంటే గతంలో రూ.300 ఖర్చు అవుతుండగా ప్రస్తుతం దాదాపు రూ.500 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. టమోట కిలో రూ.16, వంకాయకిలో రూ.30 ఉన్నా బెండ కిలో రూ.45, పచ్చిమిర్చి రూ.60, క్యాలీఫ్లవర్‌ రూ.44, చెవుళకాయ రూ.44, చిక్కుడు రూ.54 ఉన్నాయి. వాటికి తోడు సామాన్యులపై గ్యాస్‌ భారం పెరుగుతూ పోయింది. ఈ నెల 1న రూ.50 పెరగడంతో ప్రస్తుతం గ్యాస్‌ సిలింగర్‌ ధర రూ.1058గా ఉంది. దీంతో సామాన్యలు ఉన్న దాంతోనే పండగను చేసుకుంటున్నారు. కొంత మంది తక్కువ సంఖ్యలో బక్షాలతో పండగ చేసుకుంటుండగా మరికొందరు పాయసంతో సరిపెట్టుకుంటున్నారు.
మామిడాకులకూ గిరాకీ..
ఉగాదికి ఇంటిని మామిడాకులు, పూలతో అలంకరించి ఉగాది పచ్చడిని చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మామిడాకులు మామిడి తోటల్లో దొరుకుతుండగా కర్నూలు, నంద్యాల వంటి పట్టణాల్లో మామిడాకులకు కూడా గిరాకీ ఉంటోంది. మార్కెట్లలో, రోడ్ల పక్కన మామిడాకులను కూడా విక్రయిస్తున్నారు. కట్ట మామిడాకులను రూ.వందకు విక్రయిస్తున్నారు. బంతి పూలు కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు.

పాయసంతో సరి..
ఉగాదికి సాధారణంగా బక్షాలు చేసుకునే వాళ్లం. ఇప్పుడు బక్షాలు చేసుకోవాలంటే కనీసం రూ.500 ఖర్చు అవుతోంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఉన్న దాంట్లో సర్దుకోవాల్సి వస్తోంది. ఈ సారి బక్షాల బదులు పాసయంతో సరిపెట్టుకోవాల్సిందే.
- పబ్బతి శివ ప్రసాద్‌, నందికొట్కూరు.