Mar 23,2023 21:21

చాగలమర్రిలో పునాదికే పరిమితమైన జగనన్న కాలనీ

ఉగాదీ పాయె...ఇంకెప్పుడు?
- జగనన్న కాలనీల గృహ ప్రవేశాలు మళ్లీ వాయిదా
- నిర్మాణాలు పూర్తి కాకపోవడమే కారణం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

     ఉగాదికి సొంతింటిలో చేరాలని భావించిన పేదలకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఇప్పటికే పలు దఫాలు వాయిదా పడిన జగనన్న కాలనీల గృహ ప్రవేశం మరోసారి వాయిదా పడింది. మొదట గత ఏడాది డిసెంబరు అన్నారు. ఆ తర్వాత సంక్రాంతికి ఉండొచ్చన్నారు. తరువాత ఉగాది అన్నారు. ఉగాది కూడా దాటిపోయింది. ఇలా వాయిదాల పర్వం కొనసాగుతుండటంతో గృహ ప్రవేశాలు ఇంకెప్పుడు చేస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి...
పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తోంది. జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. గతేడాది జూన్‌లో శంకుస్థాపన వారోత్సవాలు నిర్వహించారు. లబ్ధిదారులతో భూమిపూజ కూడా చేయించారు. ఆ కాలనీలలోని ఇళ్ల గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గతేడాది డిసెంబర్‌ చివర్లో గృహ ప్రవేశం ఉంటుందని అన్నారు. తరువాత సంక్రాంతికి మార్చాయి. ఇప్పుడు సంక్రాంతి కూడా పోవడంతో ఉగాదికి గృహ ప్రవేశాలు చేయించాలని భావించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో గృహ ప్రవేశాలు ఉగాదికి కూడా సాధ్యం కాలేదు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్ల నుంచి సిబ్బంది, అధికారులు అందరూ లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చినా వారు ముందుకు కదలలేదు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 48,751 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. వాటిలో ఇప్పటి వరకూ 40,897 గ్రౌండింగ్‌ అయ్యాయి. అయితే వాటిలో 13,315 ఇళ్లు మాత్రమే పునాది స్థాయి, పునాది కంటే పై స్థాయికి చేరాయి. మిగిలిన వన్నీ పునాది స్థాయిలోపే ఉన్నాయి. 7,854 ఇళ్లు అసలు ప్రారంభమే కాలేదు. ఇప్పటి వరకూ 1,824 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గ్రౌండింగ్‌ అయిన ఇళ్లలో 4.45 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80లక్షలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జగనన్న కాలనీ లబ్ధిదారులకు అందిస్తోంది. బయట మార్కెట్‌లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. డబ్బులున్న వారు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల ఒత్తిడితో మరికొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి, బంగారు తాకట్టు పెట్టి ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
మౌలిక సదుపాయాలూ కరువే..
ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రాంతాలు నివాసయోగ్యంగా లేకపోవడంతో లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. కర్నూలు నగరంలో ఇప్పటికే పేదలకు పట్టాలిచ్చిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 13 వేల మందికి 2007లో ఇందిరమ్మ ఇళ్లు ఫేజ్‌-2 కింద జగన్నాథగట్టు వద్ద పట్టాలిచ్చారు. అప్పట్లో సిపిఎం ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్‌ చొరవతో ఇందిరమ్మ ఇళ్లు ఫేజ్‌-3 కింద 2008లో పందిపాడు వద్ద 52 ఎకరాలను కొనుగోలు చేసి 2500 మంది లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ రెండు ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ప్రభుత్వం విద్యుత్‌, నీరు, రోడ్లు వంటి ఎటువంటి మౌలిక వసతులూ కల్పించలేదు. దీంతో 10 శాతం లబ్ధిదారులు కూడా ఆ ప్రాంతాల్లో గృహాలను నిర్మించుకోలేదు. దీనికి తోడు ఒరిజినల్‌ పట్టాలు హౌసింగ్‌ కార్పొరేషన్‌ దగ్గర ఉండిపోవడంతో వారికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు కూడా లేకుండా పోయాయి. తరువాత వచ్చిన టిడిపి ప్రభుత్వం వాటిపైన దృష్టి సారించలేదు. ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాల వైపు చూడకపోవడంతో లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోని రుద్రవరంలో పట్టాల్విడం పట్ల కూడా లబ్ధిదారుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.