Apr 11,2021 12:27

ప్లవ నామ సంవత్సరమా !
కువ కువలు లేవేమి?
కోకిలా కోకిలా అని పిలిస్తే
రాకిలా రాకిలా అంటావేమి ?

ఏదీ నీ సుందరవదనం అంటే
మాస్క్‌ చాటున దాస్తావేమి ?
నీ కర కమలాన్ని అందుకుందామంటే
స్పర్శకు ఎర్రజెండా చూపుతావనుకోలేదు.

ఓ నా ఉగాది ప్లవంగమా !
నిజానికి నీ పేరు
హృదయంగమం కానే కాదు.
నానార్థాలేమో నీకు
నిలకడ లేనిది మాకు.

ప్లవ అంటే పడవ
కాదు కాదు
ప్లవ అంటే తెప్ప.
అంతే కాదు
గంతేసే కప్ప.
ఓ నా ప్లవా !
ఈ కరోనా చీకటి సముద్రాన్ని
దాటించ రావా !

ప్లవంగమంటే కోతి
జనులారా!
అజాగ్రత్త వలదు.
కోవిడ్‌ కోతి ఎక్కడి నుంచైనా
ఎవరి మీదైనా దూకొచ్చు.
దానిని ఎదుర్కోవాలంటే
సాహసమే సగం బలం.

తప్పేటట్టు లేదు
ప్లవకు ముందు
ఉపసర్గలు చేర్చక తప్పేట్టు లేదు.
ప్లవకు ముందు
'వి'ని తగిలిద్దాం.
విప్లవం వస్తే తప్ప
సామూలక మార్పులు రావు.

శార్వరి తర్వాత
వచ్చిన ప్లవకన్యా !
ఏమైనాయి ఆ వెన్నెల రాత్రులు !
పేరుకే
గత యేడాది పేరు శార్వరి
నిజానికది మానవ మనుగడకు వైరి.

గత ఉగాది
ఎన్ని నేర్పించింది మనకు !
మనుషుల మధ్య
గొలుసు తెగింది
అతికించమంది.
ఊపిరితిత్తులకు
కులమత భేదాలుండవంది.

జీవితం ఎంత అందమైంది !
దానిని వికార పరిచింది కరోనా.
ప్రాణాన్ని ప్రేమించడమంటే
జీవితాన్ని ప్రేమించడమే
అని ఆక్రోశించింది.
ఇవాళ భయానికి అర్థం మారిపోయింది
భయం అంటే పిరికితనం కాదు
జాగ్రత్త !
అందుకే భయంలో కూడా
కవిత్వం రాస్తాన్నేను !
అదే నా ధైర్యం !

ప్లవా! నిర్భయంగా రావా !
ఈ ఉగాదికి
ఆశల వసంతాన్ని అద్దుదాం
శరీరం కన్నా
మనసు బలమైందని నిరూపిద్దాం.

- డా. ఎన్‌. గోపి