ఉగాదికి పచ్చడితో పాటు పిండివంటలూ వండుకుంటారు. అలాంటి వాటిల్లో పూర్ణాలు ఒకటి. వీటిని చేయడంలోనే ఓ కళ దాగుంది. పూర్ణం లోపల ఎలా ఉందనేది చిన్నప్పుడు అందరికీ వచ్చిన సందేహమే.. నేటి పిల్లలకూ అదో ఫజిల్లానే అనిపిస్తుంది. అలాగే ఈ పూర్ణం బూరెల్లో కొంచెం నెయ్యి అద్దుకుని తింటే.. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటారు మరి. అందరూ చేసుకునే పూర్ణాలే చెబితే ప్రత్యేకత ఏముంది.. అందుకే ఈ పూర్ణాలు స్పెషల్ మీకు.. ఇవి రుచి సంపూర్ణం చేసేవి.. అవి ఎలా తయారుచేయాలో మీకోసం..
పచ్చికొబ్బరితో..
కావాల్సిన పదార్థాలు : పచ్చికొబ్బరి-ఒకటి, బెల్లం- కప్పు, బియ్యంపిండి- అరకప్పు, మినప్పిండి- అరకప్పు, యాలకులు - నాలుగు, జీడిపప్పు-కొద్దిగా, బాదం-కొద్దిగా, కిస్‌మిస్‌లు-కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా, నెయ్యి- కప్పు.
తయారుచేసే విధానం :
ముందుగా బియ్యంపిండి, మినప్పిండి కలుపుకొని చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
ఆ తర్వాత గ్యాస్టౌ మీద పాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక అందులో బాదం, జీడిపప్పు, పచ్చికొబ్బరి తురుము దోరగా వేయించుకోవాలి.
స్టౌ మీద మరో పాత్ర పెట్టుకొని, అందులో బెల్లం పాకం పట్టుకోవాలి.
పాకం తయారయ్యాక దాంట్లో పచ్చికొబ్బరి తురుము, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బియ్యంపిండి, మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేసుకుంటే సరిపోతుంది.
పూర్ణం బూరెలను పిల్లలు, పెద్దలూ చాలా ఇష్టంగా తింటారు.
పెసరపప్పుతో...
కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు - రెండు కప్పులు, బెల్లం - రెండు కప్పులు, కొబ్బరి - ఒకటి(తురుము), యాలకులు - నాలుగు, బియ్యం - రెండు కప్పులు, మినపప్పు - కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందురోజు రాత్రి బియ్యం, మినపప్పు నానబెట్టుకోవాలి.
మరునాడు పూర్ణాలు తయారు చేసుకోవడానికి అరగంట ముందు బియ్యం, మినపప్పు దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి.
అలాగే పెసరపప్పునూ గంటసేపు నానబెట్టుకోవాలి. తర్వాత దానిని ఇడ్లీపిండిలా రుబ్బుకోవాలి.
రుబ్బిన మిశ్రమాన్ని ఇడ్లీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత బెల్లం ముదురు పాకంలాగా చిక్కగా పట్టుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీలుగా చేసుకున్న ఆ కుడుములను మనం పొడి చేసుకుని అందులో యాలకుల పొడి, కొబ్బరి, బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి.
దానిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
తర్వాత మినపప్పు, బియ్యంపిండిలో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
పాన్‌లో నూనె కాగిన తరువాత ఆ ఉండలను పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకుంటే పెసరపప్పు పూర్ణాలు తయారైనట్లే.
కొంచెం వేడిగా ఉండగానే అందులో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
క్యారెట్‌తో..
కావాల్సిన పదార్థాలు : క్యారెట్ తురుము- రెండు కప్పులు, పంచదార- ఒకటిన్నర కప్పు, పాలు- కప్పు, నెయ్యి- రెండు కప్పులు, బాదం, ద్రాక్ష, జీడిపప్పు- అరకప్పు, మినపప్పు- కప్పు, బియ్యంపిండి- రెండు కప్పులు, ఉప్పు- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
బియ్యంపిండిని కొంచెం నీటితో ముద్దగా కలుపుకోవాలి.
మినపప్పు రెండు గంటల పాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానిని తడిపిన బియ్యంపిండిలో వేసి తగినంత ఉప్పు కలిపి గంట నాననివ్వాలి. (బియ్యంపిండి, మినపప్పు మిశ్రమం ఇష్టపడని వారు మైదాలో చిటికెడు ఉప్పు, నీళ్ళు గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి).
తర్వాత పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడి పప్పు, బాదం, ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యివేసి క్యారెట్ తురుమును వేయించి, పాలు పోసి ఉడికించాలి.
పాలు ఇగిరిన తర్వాత పంచదార వేసి అది కరిగి మళ్లీ బాగా దగ్గరయ్యే వరకు ఉడికించాలి.
క్యారెట్ మిశ్రమం చల్లారిన తర్వా త చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఆ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా బంగారురంగు వచ్చేవరకూ వేయించి తీసుకోవాలి.
అంతే రుచికరమైన క్యారెట్ పూర్ణాలు రెడీ.