ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఉగాది నాటికి జిల్లాలో జగనన్న ఇళ్ల లేఅవుట్లలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశించారు. హౌసింగ్ డే సందర్భంగా శనివారం ఆయన అచ్యుతాపురం మండలం కొల్లివానిపాలెంలో పర్యటించారు. అక్కడ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం గృహ నిర్మాణంలో అనకాపల్లి జిల్లా ముందు వరసలో ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖ కృషి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో ఉంచాలని సూచించారు. గృహ నిర్మాణానికి ఎటువంటి చిక్కులు ఏర్పడకుండా నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. అవసరమైన మౌలిక వసతులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిశీలన
మండలంలో ఏపీ ఎంఐపి వారు చేస్తున్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సాగవుతున్న భూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, బిందు సేద్యాలను గూర్చి రైతులకు సంపూర్ణమైన అవగాహన కలిగించి పంటలకు ఏ విధంగా ఉపయోగ పడుతుందో వివరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి, అచ్యుతాపురం తహశీల్దారు వై శ్రీనివాసరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, ఉపాధి హామీ పథకం ఏపీఓ వై వెంకటేశ్వరరావు, నర్మల రామకృష్ణ, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.










