ప్రజాశక్తి- కె.కోటపాడు
ఉగాది నాటికి అనకాపల్లి జిల్లాలో 56 వేల గృహాలను సిద్ధం చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుర్మినాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లను డిఈ శామ్యూల్ రాజుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు రూ.330 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వెంట వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేని లబ్ధిదారుల పట్టాలను రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారని, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే ఇంటి నిర్మాణాలను చేపట్టాలని కోరారు. 60 వేల బస్తాలు సిమెంటు, 130 టన్నుల ఐరన్ సిద్ధంగా ఉందని, ఇసుక కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. కె.కోటపాడు మండలంలో 95శాతం గ్రౌండ్ లెవెల్ పూర్తి చేసుకుని నిర్మాణాలు సాగుతున్నాయని, ఉగాది నాటికి పూర్తి చేయించడానికి తమ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ రవిబాబు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










