Jul 30,2023 21:39

ప్రజాశక్తి - కుక్కునూరు
         ముంపు మండలాల్లో ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం భద్రాచలంలో 55 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రానికి 51 అడుగులకు చేరి నిదానంగా తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇప్పటికే మండలంలోని వింజరం, ముత్యాలంపాడు, కుక్కునూరు, దాచారం, సీతారామనగరం, శ్రీధర గ్రామాల మధ్య కాజ్‌వేలను వరద ముంచెత్తడంతో 13 రోజులుగా 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో చీరవల్లి - వింజరం, బూర్గంపాడు- వేలేరు మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఐదు రోజులుగా తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా గొమ్ముగూడెం గ్రామానికి చెందిన 253 కుటుంబాలు, వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన 203 కుటుంబాలు రావికుంటు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాయి. ఆదివారం ఉదయం బెస్తగూడెం ఎస్‌సి కాలనీల్లోకి వరద చేరుతుండటంతో బెస్తగూడేనికి చెందిన 150 కుటుంబాలు రావికుంట కాలనీకి వెళ్లాయి. కుక్కునూరు 'ఎ' బ్లాక్‌లోని 400 కుటుంబాలు కివ్వాక, ఎల్లప్పగూడెంలోని 55 కుటుంబాలు మర్రిపాడు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాయి. భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టినా కాపర్‌ డ్యామ్‌ ప్రభావం, శబరి నదికి భారీగా వరద నీరు చేరి పోటెత్తడంతో మండలంలోని రహదారులపై నీరు తగ్గడంలేదు. మండలంలోని రజక బజార్‌, సినిమా హాలు సెంటర్‌, మసీద్‌ కాలనీలు ముంపులోనే ఉన్నాయి.
గొమ్ముగూడెం వరద బాధితులున్న రావికుంట పునరావాస కేంద్రంలో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు, ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్లు లేక రాత్రి సమయంలో విషసర్పాల తిరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెండు రోజులు మాత్రమే భోజనంపెట్టారని, ఆదివారం భోజనం పెట్టలేదని, ప్రతిఏడాదీ తమ గ్రామాన్ని వరదలు ముంచెత్తుతున్నాయని, ఈ బాధలు పడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం:పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 13,80,216 క్యూసెక్కుల అదనపు జలాలను ఆదివారం దిగువ విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. ప్రాజెక్ట్‌ స్పిల్‌వే ఎగువన 34.280 మీటర్ల నీటిమట్టం, స్పిల్‌వే దిగువన 26.220 మీటర్లు, ఎగువ కాపర్‌ డ్యాం వద్ద 35.460 మీటర్లు, దిగువ కాపర్‌ డ్యాం వద్ద 25.480 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 26.017 మీటర్లకు పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే కడెమ్మ వంతెన, పోలవరం ప్రాజెక్టు పోలీస్‌ చెక్‌పోస్టు నీటి మునిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్టు అధికారులు, కార్మికులు కడెమ్మ అవుట్‌ ఫాల్‌ స్లూయీస్‌ మీదుగా ప్రాజెక్టుకు రాకపోకలు సాగిస్తున్నారు.