Aug 22,2023 21:44

సమావేశంలో పాల్గొన్న సిఐటియు నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మికులపై ప్రభావం అనే అంశంపై అంగన్‌వాడీ కొమరాడ ప్రాజెక్టు కార్యకర్తలకు నిర్వహించిన వైజ్ఞానిక తరగతుల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనందిస్తున్న విధానాలు కార్మికులకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు పెంచకుండా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఈ సమస్యలపై కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలు అణగారిన వర్గాలకు అందకుండా చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుల,మత ఘర్షణలను లేపుతున్నారని అందులో భాగంగానే మణిపూర్‌లో జరిగిన దుర్ఘటన అని ఉదహరించారు. శ్రామిక మహిళా నాయకులు వి.ఇందిర, జి.జ్యోతి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బ తీయడం సరైంది కాదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము అవలంబిస్తున్న తప్పుడు విధానాలు విరమించుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం కొమరాడ ప్రాజెక్ట్‌ , వివిధ సెక్టార్ల నాయకత్వ ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు యూనియన్‌ నాయకులు సిహెచ్‌ గౌరమ్మ, ఎం.సావిత్రి, అనురాధ, మల్లీశ్వరి పాల్గొన్నారు.