
ప్రజాశక్తి-గుంటూరు : జెఎసి అమరావతి అవుట్‌సోర్సింగ్ విభాగం జిల్లా మహాసభ ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. జెఎసి కన్వీనర్ సుమన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జెఎసి మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ఐక్య పోరాటాతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎపి జెఎసి అమరావతి జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రశ్నించకుండా, పోరాడకుండా హక్కులు సాధించుకోలేమని చెప్పారు. జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు యాభైవేల మందికిపైగా ఉంటే కేవలం 10,117 మందినే క్రమబద్దీకరించటం సరికాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎపి జెఎసి జిల్లా అధ్యక్షులు కె.సంగీతరావు, నాయకులు శిరీష పాల్గొన్నారు.