Mar 11,2023 01:21
మాట్లాడుతున్న బాపట్ల జిల్లా వామపక్ష నాయకులు

ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను పని ఒత్తిడితో అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులపై కావాలని పని ఒత్తిడి పెంచారన్నారు. పని భారంతో అనేక మంది ఉద్యోగులు మృత్యువాత పడుతున్నా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులను అటెండెన్స్‌ జీతాలకు లింకు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల బాకీలు ఇవ్వకుండా వారు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడేసుకుంటోం దని అన్నారు. జీతాలు పెండింగులో ఉన్నాయన్నారు. పట్టభద్రుల ఎన్నికలు రావడంతో ఉద్యోగులు దాచుకున్న డబ్బు రూ.3,000 కోట్లు రిలీజ్‌ చేస్తామని అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటూ కంటి తుడుపు చర్యకు పూనుకుందని అన్నారు. ఈ విషయాన్ని సిపిఐ, సిపిఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. పని ఒత్తిడితో వేటపాలెం మండలంలోని ఒక పాఠశాలలో పంగులూరు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ నెల 13న జరిగే పట్టభద్రుల గ్రాడ్యుయేట్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ పిడిఎఫ్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌ సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి పెంచి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను వెంటనే అమలులోకి తెస్తానని మాట ఇచ్చి దానిని మరిచిన ఘనుడు సిఎం జగన్‌ అని అన్నారు. మాట తప్పం మడమ తిప్పం అనే నినాదంతో ప్రజలను అనేక రకాలుగామోసం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. సిపిఐ జిల్లా నాయకులు తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అధికార ప్రభుత్వం ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కెఎల్‌డి ప్రసాద్‌, బి విజరుకుమార్‌, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.