Nov 30,2022 23:38

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-పాడేరు: కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, లేబర్‌ పోర్టుల పేరుతో కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వం రెగ్యులర్‌ చేయడం లేదని విమర్శించారు. ఒడిశా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇటీవల కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల్ని ఆ ప్రభుత్వాలు రెగ్యులర్‌ చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అంగన్వాడీ వర్కర్లకు గ్రాడ్యుటీ అమలు చేయలేదని ఆయన అన్నారు. అంగన్వాడీ వర్కర్లను కార్మికులుగా గుర్తించి రూ.26 వేల వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో పని చేస్తున్న సిహెచ్డబ్ల్యులను కొంతమందిని ఆశా వర్కర్లుగా గుర్తించారని, ఇంకా 700 మంది సిహెచ్‌ డబ్ల్యూ గానే ఉన్నారని తెలిపారు. సిహెచ్‌బ్ల్యులకు కూడా రూ.10,000 వేతనం చెల్లించి, పూర్తి స్థాయి కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మిడ్‌ డే మీల్స్‌ పథకం చాలా ఉపయోగంగా ఉందని, ఇందులో పని చేస్తున్న స్కీం వర్కర్లకు స్వల్ప వేతనాలు ఇస్తున్నారని వీరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, గిరిజన ఆశ్రమాల్లో విద్యార్థుల మెనూ మార్పు చేసి మంచి పోషకాహారం అందింది. మెస్‌ చార్జీలు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోనంగి చిన్నయ్యపడాల్‌, ఉమామహేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్‌. సుందరరావు పాల్గొన్నారు.