ప్రజాశక్తి-పాడేరు: సమగ్ర శిక్ష, కేజీబీవీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి విద్యా శాఖలో విలీనం చేయాలని సీఐటీయూ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అల్లూరి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఐటీడీఏ ముందు సీఆర్పీలు, కేజీబీవీల టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు వేడుకోలు దీక్ష నిర్వహించారు. 11 మండలాల నుంచి వేడుకోలు దీక్షకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల చిన్నచూపుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉద్యోగులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. పోరాడుతున్న ఉద్యోగులను, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తుందని విమర్శించారు.తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర శిక్ష, కేజీబీవీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం పద్ధతి రద్దు చేసి ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. కరువు భత్యం, ఇంటి అద్దె సౌకర్యం, రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటి కల్పించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి, పని భారం తగ్గించాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేసి, జాబ్ చార్ట్, ప్రతినెలా ఒకటో తేదీ నాటికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మండి అనిల్ కుమార్ మాట్లాడుతూ ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేతనాల పెరగపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎదురుచూసిన ఫలితం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి వి.జయరాజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిడిపి డివిజన్ నాయకులు, సర్పంచ్ పాండురంగ స్వామి మాట్లాడుతూ, ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శెట్టి నాగరాజు మాట్లాడుతూ, పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎల్.సుందరరావు మద్దతు ప్రకటించారు. ఈ వేడుకోలు దీక్షలో సిఆర్పీలు, కేజీబీవీల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, యూనియన్ కోశాధికారి పూజారి సింహాచలం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సొలగం గౌరీ శంకర్, మహిళ కన్వీనర్ లోచల వీరభద్రమ్మ, ఇతర మండలాల ప్రతినిధులు వర్తన సుజాత, గడుతూరి ఈశ్వరరావు, శకుంతల, పి.రాంబాబు పాల్గొన్నారు.










