ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులు కార్మికులను మోసం చేసిందని బాపట్ల జిల్లా సిఐటియు కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మజుందార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సిఐటియు మద్దతు తెలుపుతుందన్నారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుని పర్మినెంట్ చేసేవరకు ఉద్యమించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాటం చేస్తున్న ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులును పర్మినెంట్ చేయడంతో పాటు, సీపిఏస్ రద్దు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుకు న్యాయ మైన పీఆర్సీ,డిఏ ఇతర బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు సీఐటీయూ మద్దతు నిస్తుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు నెరవేర్చేవరకు ప్రభుత్వ మెడలు వంచే విధంగా రాష్ట్రంలో ఐక్య పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఉద్యోగులు చేపట్టిన ధర్నా కు మద్దతుగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మణిలాల్, జిల్లా నాయకులు వసంతరావు, ప్రతాప్, ఆదాము, దాసు, శామ్యేలు, వెంకట్రావు పాల్గొన్నారు.










