ప్రజాశక్తి-బాపట్ల రూరల్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఏపి జేఏసి చైర్మన్ సిహెచ్ సురేష్ బాబు అన్నారు. ఏపీ జేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ టి రజనీకాంత్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి రాము, జనరల్ సెక్రెటరీ పి హరి, ఎఐటియుసి నాయకులు శ్రీధర్, సీఐటీయూ నాయకులు ఎం మజుందార్, సహకార సంఘం జిల్లా అధ్యక్షులు ఎం మురళి మనోహర్‌రెడ్డి, ఆర్‌టిసి మహిళా సంఘం నాయకులు కె రజని, జేఏసి జిల్లా కోశాధికారి డి దిలీప్ తదితరులు ప్రసంగించారు. మొదటి దశలో నియామకం జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల 9 నెలల కాలానికి చెందిన బకాయిలు, రెండో విడతలో నియామకమైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐదు నెలల కాలానికి చెందిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సాధారణ బదిలీలు వెంటనే కల్పించాలన్నారు. వారిపై రోజువారి నిర్దేశించిన పౌర సేవలు, లక్ష్యాలు, పని ఒత్తిడి తగ్గించాలన్నారు. రూరల్ నుంచి అర్బన్‌కు విలీనం అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ మేటర్స్, సీనియారిటీ అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే తయారు చేయాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్‌ను డిస్కమ్స్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొందరు సచివాలయ ఉద్యోగులు గతంలో పనిచేసిన ఉద్యోగంలో పరిగణలోకి తీసుకొని వారికి ఏ ప్రొడక్షన్ కల్పించాలన్నారు. వారి జాబ్ చార్టును పూర్తిస్థాయిలో అమలయ్యే విధంగా చేయాలన్నారు. ఏపీ జిఎల్‌ఐ బాండ్లు వెంటనే జారీ చేయాలన్నారు. శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సిబ్బందికి మేస్త్రి డ్యూటీ నుంచి విముక్తి కలిగించాలన్నారు. ఎంప్లారుమెంట్ హెల్త్ స్కీమ్ కార్డులు వెంటనే జారీ చేయాలని తెలిపారు. ఏఎన్‌ఎంఎస్‌ల మీద భారం తగ్గించాలన్నారు. సంరక్షణ కార్యదర్శి లేదా మహిళా పోలీస్ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యదర్శులకు బందోబస్తు డ్యూటీలు కేటాయించవద్ద న్నారు. ప్రాన్ ఖాతాలో 9 నెలల పెన్షన్ ఫండ్ బకాయిలు వెంటనే జమ చేయాలని అన్నారు. గ్రేట్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు జీవో నెంబర్ 149 అమలుపరచి డిడిఓ అధికారాలు వెంటనే కల్పించాలన్నారు. గ్రేడ్-2 విఆర్‌ఓ లకు ప్రవేశం వెంటనే డిక్లేర్ చేయాలన్నారు. ఫెయిర్ అసిస్టెంట్ వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ చానల్ కల్పించాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించి ఫ్రంట్ ఆఫీస్ డ్యూటీని సచివాలయంలోని అందరూ ఫంక్షనరీస్‌తో నిర్వహించేలా చేయాలన్నారు. సిపిటి పరీక్ష వలన ప్రవేశం పూర్తికాని గ్రేడ్ 2 విఆర్‌ఓలకు, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి వెంటనే సిపిటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసి ఉపాధ్యక్షులు ఎ సుమంత్ రాజ్, రెవెన్యూ సంఘ కోశాధికారి బి ఓంకార్, ప్రచార కార్యదర్శి డి అర్జున్, జిల్లా నాయకులు పెరుగు శ్రీనివాసరావు, సిటీ యూనిట్ సహాయ కార్యదర్శి జాసన్, ఉద్యోగులు పాల్గొన్నారు.










