జి.శివడ సెంటర్ వద్ద ఫేస్ యాప్ కోసం కష్టాలు పడుతున్న ఉద్యోగులు
ప్రజాశక్తి - కురుపాం : గిరిజన గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఫేస్‌యాప్ కష్టాలు తీరడం లేదు. దసరా సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలకు ఉపాధ్యాయులు, సచివాలయాలకు సిబ్బంది వెళ్లే నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో జియో సిగల్స్ లేకపోవడం వల్ల ఫేస్ యాప్ పడక నానా ఇబ్బందులు పడ్డారు. మొండెంఖల్ కేంద్రానికి సమీపంలోని జి.శివడ సెంటర్ వద్దకు వెళ్లి సిగల్స్ కోసం అష్టకష్టాలు పడుతూ ఫేస్ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి వచ్చింది. గిరిజన గ్రామాల్లో సక్రమంగా సిగల్స్ లేకపోవడంతో ఫేస్‌యాప్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజన గ్రామాల్లో సిగల్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










