ప్రజాశక్తి-డుంబ్రిగూడ:తమ హక్కుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసి వేధింపులకు గురి చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుల ఎస్‌బి పోతురాజు విమర్శించారు. గురువారం డుంబ్రిగూడ మండల కేంద్రంలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు పిలుపు మేరకు నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద నిరసన తెలుపుతూ మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు .కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ప్రభుత్వం విధానాలతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకు 100 శాతం ఉద్యోగాలు కల్పించిన జీవో 3 రిజర్వేషన్‌ను పునరుద్దించాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలు తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఇచ్చిందని, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తక్షణమే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు టి సూర్యనారాయణ, పాంగి సత్యనారాయణ, కె.రామకృష్ణ, కిముడు రామచందర్, పాంగి మోహన్ దాస్, గొల్లూరి జగన్నాథం పాల్గొన్నారు.










