ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు జిల్లా విస్తృత సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో దండా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు దశలవారీగా జరిగే పోరాటంలో కాంటాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునర్ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. సంక్షేమ బోర్డు పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ 99శాతం వాగ్దానాలు అమలు చేశామన్న ముఖ్యమంత్రి కార్మికులకు సంబంధించిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా, వారు చేస్తున్న పాదయాత్రకు మద్దతు సిఐటియు తెలియజేస్తుందని తెలిపారు. తక్షణమే పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు బి.ముత్యాలరావు ఎస్.కె.హుస్సేన్‌వలి, యన్.శివాజీ, సుకన్య పాల్గొన్నారు.










