May 22,2023 01:54
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఏపీ జేఏసి అమరావతి మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 'ఉద్యోగుల వేదనను చెబుదాం' అనే నినాదంతో ఆదివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. 1.7.2018, 1.1.2019, 1.7.2019, 1.7.2021 పెండింగ్‌లో ఉన్న 4 డీ ఏ అరియర్స్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. 11వ పిఆర్‌సి కమీషన్‌ రికమెండ్‌ చేసిన పేస్కేల్స్‌ వెంటనే విడుదల చేయాలి. పిఆర్‌సి అరియర్స్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలు వెంటనే విడుదల చేయాలి. ముఖ్యమంత్రి పాదయాత్ర లో ప్రకటించినట్లుగా సిపిఎస్‌ను వెంటనే రద్దు చేసి ఓపిఎస్‌లోకి మార్చాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచాలి. వీఆర్‌ఏలకు సంబంధించిన ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దీనిపై ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ స్పందిస్తూ ఉద్యోగుల ప్రధాన సమస్యలు వాస్తవమని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసి అమరావతి, బాపట్ల జిల్లా చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌ బాబు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు టి భాస్కరరావు, చీరాల డివిజన్‌ కోశాధికారి, ఎస్‌ బాలవెంకట విష్ణు ప్రసాద్‌, సభ్యులు బి అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.