Sep 09,2023 23:22

ప్రజాశక్తి-కాకినాడ ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ (ఎపిజిఇఎఫ్‌) కీలక పాత్ర పోషిస్తోందని ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా పరిషత్‌ కళ్యాణ మండపంలో ఎపిజిఇఎఫ్‌ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో ఫెడరేషన్‌ను బలోపేతం చేసేందుకు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. త్వరలోనే సిపిఎస్‌, కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేందుకు సిఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. వారిని రెగ్యులర్‌ చేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తాము సిఎంను కోరినట్లు చెప్పారు. సిపిఎస్‌ ఉద్యోగుల గురించి ఆయన మాట్లాడుతూ వారికి కూడా 2014 జూన్‌ 15కి ముందున్న ఐదేళ్లు సర్వీస్‌ దాటిన వారిని పరిగణలోకి తీసుకుంటామని సిఎం చెప్పారని ఆ నిబంధనను తొలగించి అందర్నీ తీసుకోవాలని తాము సూచించినట్లు చెప్పారు. సిపిఎస్‌ ఉద్యోగులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులర్‌ చేసేందుకు తమ ఫెడరేషన్‌ వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తుందని, దాని ఫలితం త్వరలోనే ఉంటుందనే ఆశ భావాన్ని వెంకట్రామిరెడ్డి వ్యక్తం చేశారు. తమ ఫెడరేషన్లో 130 సంఘాలు ఉండగా అందులో 29 గుర్తింపు సంఘాలు ఉన్నాయన్నారు. ఉద్యోగ సమస్యలన్నీ వరుస క్రమంలో పరిష్కరించేందుకు సిఎం జగన్‌ సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు కాకర్ల చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవ పాల్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, రాష్ట్ర ఫెడరేషన్‌ కో చైర్మన్‌ విఎస్‌ దివాకర్‌, రాష్ట్ర కోశాధికారి జి.రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలుగు జ్యోతి, జిల్లా సెక్రెటరీ జనరల్‌ పిఎన్‌వి.సత్యనారాయణ, నాయకులు నక్కా వెంకటరత్నం, గోవర్ధన్‌, సూరిబాబు, శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఈశ్వర సాయి, మెహబూబ్‌ బాషా పాల్గొన్నారు. అనంతరం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా డి.శ్రీలలిత, ప్రధాన కార్యదర్శిగా డి.తాతాజీరావు, ఉపాధ్యక్షునిగా పి.సతీష్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా షేక్‌ మహబూబ్‌ బాషా ఎన్నికయ్యారు.