Apr 25,2023 17:47

సంఘీభావం తెలుపుతున్న సిఐటియు నాయకులు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం డిమాండ్‌ చేశారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు అమరావతి జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌ ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్‌, కె.మహమ్మద్‌ గౌస్‌, జిల్లా కార్యదర్శి పి.వెంకట లింగంలు సంఘీభావం తెలిపారు. అనంతరం వి.ఏసురత్నం మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి నాడు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు ఇస్తామని హామీలిచ్చి నేడు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు పూర్తయినా ఆచరణలో లేదన్నారు. గత 48 రోజులుగా ఉద్యోగులంతా ఆందోళన చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో చర్చించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేనిపక్షంలో రాబోయే కాలంలో ఉద్యోగులంతా ఐక్యమై వైసిపికి పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఆమరావతి జెఎసి ఆధ్వర్యంలో చేసే ఆందోళనలకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.