ప్రజాశక్తి -పాడేరు: గిరిజన ఉద్యోగ రిజర్వేషన్ జీవో 3 ని పునరుద్ధరించడం చాలా ఆవశ్యమని ఇందుకు గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ సమిష్టిగా పోరాటం సాగించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని వారు ఆదివారం సందర్శించి తమ మద్దతు తెలిపారు. మూడో రోజు ఈ రిలే దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో 3 పునరుద్ధరణ కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ చెప్పారు. గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పలాసి కృష్ణారావు, ముఖి శేషాద్రి, గిడ్డి వరలక్ష్మి పాల్గొన్నారు.










