ప్రజాశక్తి అరకులోయ రూరల్: ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు కిల్లో ఓనాది అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చిన్న చూపుతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూప లేదన్నారు. చాలీచాలని జీతాలు ఇచ్చి గొడ్డు చాకిరి చేయిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చేయడంతో విఫలమైందన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎక్కడా అచరణకు నోచుకోలేదన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న లెక్చరర్ల సమస్యలపై కనీసం ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదని విమర్శించారు.ఔట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్‌గా మార్చాలని కోరినా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ టూరిజం లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయలేదని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ముఖచిత్ర యాప్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ శెట్టి నాగరాజు, గురుకులం ఉపాధ్యాయ లెక్చరర్ సంఘం జిల్లా కార్యదర్శి గొల్లూరి రాజు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు అప్పలస్వామి, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటరమణ, ఏపీ టూరిజం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగరాజు,హెల్త్ వాలంటరీ సంఘం అధ్యక్షులు గంగాధర్, భాష వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కుమారి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి బాలదేవ్, సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, నాయకులు కొండలరావు, రాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










