ప్రజాశక్తి - ఆదోని
ఉద్యోగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షులు ఎస్‌ఎ.రషీద్ విమర్శించారు. బుధవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద ఉద్యోగుల సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా 1న జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని, దానికి ప్రత్యేకమైన చట్టం రూపొందించాలని కోరారు. అధికారంలో రాకముందు వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని ఉద్యోగులకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. న్యాయమైన హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ, అరియర్స్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 22 నుంచి తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ప్రక్రియ మొదలైందన్నారు. కార్యాచరణలో భాగంగానే జూన్ 1న పట్టణంలోని ఎన్‌టిఆర్ సర్కిల్‌లో రిలే దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఉద్యోగులంతా భారీగా తరలిరావాలని కోరారు. 12వ పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎల్లయ్య, సహాయ కార్యదర్శి రవి, కార్యవర్గం రాధాకృష్ణ, నబీ రసూల్, లక్ష్మి, చెన్నయ్య ఉన్నారు.
మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షులు రషీద్










