ప్రజాశక్తి-గుంటూరు : నవరత్న పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల కుటుంబాల్లో మాత్రం చీకటి నింపుతుందని ఏపీజేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ అమరావతి మూడో విడత నిరసల్లో భాగంగా 'ఉద్యోగుల ఆవేదన చెప్పుకుందాం' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముస్తఫాకు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. అన్ని శాఖల్లో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట ఇస్తే చేసి తీరుతారని, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే వెనకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఎంతో నిబద్ధత కనబరుస్తున్నారని, అందుకే ప్రజలకు ప్రభుత్వం దగ్గర కాగలుగుతోందని అన్నారు. అలాంటిది ప్రభుత్వంలో భాగస్వాములమైన ఉద్యోగులపై ఎందుకంత వివక్ష చూపుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రతి ఉద్యోగీ ఏదోఒక రకంగా ప్రభుత్వ తీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ మరియు కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇలా అన్ని విభాగాల్లో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. వీటిని పెద్ద మనసుతో ఆలకించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా సెక్రటరీ కిరణ్‌కుమార్, నాయకులు ఈదులమూడి మధుబాబు, కరిముల్లా, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.










