
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానిఇక సత్వర చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పి.కొండయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతినెల మూడవ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన అర్జీలను స్వీకరించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వినతులను స్వీకరించి ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వృత్తిలో, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల ద్వారా సమర్పించుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నుంచి 15 అర్జీలు వచ్చాయన్నారు.కొంతమంది తమ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేయవలసిందిగా కోరారన్నారు. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరారన్నారు. ఈసందర్భంగా పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఎ అమలు చేయాలని జీవో ఉన్నప్పటికీ కొన్ని శాఖలలో ఇవి అమలు కావడం లేదని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్దన్న, షబ్బీర్, శోభారాణి, బాబన్న, శ్రీనివాసులు, శేఖర్ తదితరులు వేర్వేరుగా ఆర్డీవోకు అర్జీలు సమర్పించారు. సత్యసాయి తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షులు లింగ రామ్మోహన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై డిఆర్‌ఒకు వినతిపత్రం సమర్పించారు. అలాగే పెనుకొండ అటవీ శాఖలోని షీప్ ఫారం లో పనిచేస్తున్న నర్సరీ వాచర్ ఉద్యోగి అంజనప్ప గత ఏడాది కాలం నుంచి జీతభత్యాలు తనకు రావాల్సి ఉందని ఇతర బిల్లులు మంజూరు కాలేదని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.