Nov 29,2022 23:11

  •  సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం 
  • ఎన్జీవో నేతలు ఎ.విద్యాసాగర్‌, ఎండి ఇక్బాల్‌

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌
ప్రభుత్వ పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వద్దకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులపై చిన్నచూపు తగదని, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగంగా భావించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ కోరారు. స్థానిక గాంధీనగర్‌ ఎన్జీవో హోమ్‌ లో జరిగిన ఏపీఎన్జీవో విజయవాడ నగర శాఖ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపి ఎన్‌జివో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పిఆర్‌సి బకాయిల చెల్లింపు, జిపిఎఫ్‌, ఇన్సూరెన్స్‌ మరియు సరెండర్‌ లీవ్‌ వంటి వాటి పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, సిపిఎస్‌ రద్దు అంశంతో పాటు అనేకమైన డిమాండ్లు సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పినా ఇంతవరకు ఫలితం కనబడటం లేదని తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల పట్ల మంత్రులు చులకనగా మాట్లాడటం తగదన్నారు. అవసరమైతే కాళ్లు పట్టుకోవడం వంటి మాటలు ఆక్షేపణీయమన్నారు. ఇటువంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో తీవ్ర మనస్తాపానికి గురి చేశాయన్నారు. ఉద్యోగులు కోరుకుేది న్యాయమైన డిమాండ్‌లు మాత్రమేనని రావాల్సిన బకాయిలను మాత్రమే కోరుతున్నామన్నారు. ఏపి ఎన్‌జివో అసోసియేషన్‌ విజయవాడ నగర శాఖకు ఘన చరిత్ర ఉందని రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఉద్యోగ ఉపాధ్యాయు ఉద్యమాలకు విజయవాడ వేదికగా నిలిచిందన్నారు. ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఎన్జీవో నగర శాఖ జిల్లా నాయకత్వంతో పాటు ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. ఎల్లప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతర కార్యాచరణ చేస్తుందని కొనియాడారు. ఉద్యోగ సమస్యలతో పాటు సామాజిక కార్యక్రమాలలో నగర శాఖ కార్యవర్గం చురుకైన పాత్ర పోషించి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారానే ఉద్యోగుల హక్కులు ప్రయోజనాలు సాధించుకోగలమని ఇప్పటివరకు రాష్ట్ర ఎన్జీవో సంఘ మిచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు ఎటువంటి సహాయ సహకారాలు అందించారు మునుముందు జరగబోయే కార్యచరణకు కూడా సిద్దం కావాలని పిలుపునిచ్చారు. నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె. స్వామి, కె. సంపత్‌కుమార్లు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్యవర్గం చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేధికను సమర్పించి జమా ఖర్చుల వివరాలను వివరించారు. సర్వసభ సమావేశంలో నగర శాఖ సహా అధ్యక్షులు బివి రమణ, కోశాధికారి ఎస్‌కె నజీర్‌ద్దీన్‌, అర్గనైజింగ్‌ సెక్రటర్‌ వివి ప్రసాద్‌, ఉపా అధ్యక్షులు బి రాజా చౌదరి, వై రవి, ఎస్‌కె కాసిమ్‌ సాహేబ్‌, కె. శివలీల, సంముక్త కార్యదర్శులు ఎన్‌ దుర్గరావు, కెఆర్‌ఎస్‌ గణేష్‌, సిహెచ్‌ సివిఆర్‌ ప్రసాద్‌, జి వెంకటేశ్వరరావు,డిఇసి మెంబర్లు కె. శివశంకర్‌, భాస్కర్‌ నాయుడు, ఎ నాగరాజు పాల్గొన్నారు.