
జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి
ప్రజాశక్తి - భీమవరం
ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉద్యోగుల గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుంచి 11 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలతో సతమతమైతే విధులు సరిగ్గా నిర్వహించలేరని, గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే వారు మరింత స్వేచ్ఛగా పనిచేసి శాఖలకు మంచి పేరు తెస్తారని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు, పెన్షన్, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ సమస్యలపై అర్జీలను ప్రతినెలా మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌లో అందజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ కెసిహెచ్.అప్పారావు, జిల్లా ట్రెజరీ అధికారి ఎ.గణేష్, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎఒ వైకెవి.అప్పారావు పాల్గొన్నారు.