ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 50 వినతులు వచ్చాయి. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్వులు కె.శ్రీరాములు, బి.వి.వి.ఎన్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వేణుగోపాలరావు తదితరులు వినతిపత్రం అందజేశారు. గ్రేడ్-2 జెఎల్‌ఎంలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి ప్రొవిజన్ డిక్లేర్ చేయాలన్నారు. ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీనిచ్చారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










