Mar 09,2023 22:25

వచ్చేనెల ఐదో తేదీ వరకూ నల్లబ్యాడ్జీలతో నిరసన
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

ఎపి జెఎసి అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా స్వచ్ఛందంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం సంతోషాదయకమని రెవెన్యూ అసోసియేషన్‌ జిలా అధ్యక్షులు రమేష్‌ పేర్కొన్నారు. ఎపి జెఎసి అమరావతి పిలుపులో భాగంగా ఏలూరు ఆర్‌డిఒ ఆఫీస్‌తో పాటు, కుక్కునూరు సహా పలు ప్రాంతాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏలూరులో రమేష్‌ మాట్లాడారు. ఈ నెల పదో తేదీన ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మిక, రిటైర్డ్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు, ఇప్పటికే నేటి నుండి ఉద్యమ కార్యచరణ అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల ఏడో తేదీన ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో జరిపిన చర్చల్లో జెఎసి అమరావతి పక్షాన కూడా రాష్ట్రకమిటీ పాల్గొని, ఉద్యోగుల అనేక ఆర్థిక, ఆర్థికేతర అంశాలు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ప్రతినెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, తదితర ఆర్థిక అంశాలపై, అలాగే ఆర్థికేతర అంశాలు ప్రధానంగా సిపిఎస్‌ రద్దు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతభత్యాలు పెంపుదల, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపైన, గ్రామ వార్డ్‌ సచివాలయ ఉద్యోగుల సమస్యలు, ఆర్‌టిసి ఉద్యోగుల ఓటి ఇతర అలవెన్సులు తదితర అనేక దీర్ఘకాలిక అర్థికేతర అంశాలపై మినిట్స్‌లో స్పష్టత ఇవ్వనందున రాష్ట్ర కార్యవర్గం పూర్తిగా అసంతృప్తిని వ్యక్తం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.