Apr 08,2023 22:32

ప్రజాశక్తి - ఏలూరు
           ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎపి అమరావతి జెఎసి కార్యాచరణలో భాగంగా స్థానిక కొత్తబస్టాండ్‌ వద్ద ఎపి అమరావతి జెఎసి చైర్మన్‌ కె.రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఈనెల పదో తేదీన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిని అందిస్తామన్నారు. 11వ తేదీన ప్రతీ ఉద్యోగి సెల్‌డౌన్‌ కార్యక్రమం చేపడతామన్నారు. 12న కలక్టరేట్‌ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు ధర్నా చేపడతామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్‌ రద్దు చేయాలన్నారు. 15వ తేదీన సిపిఎస్‌ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్‌ అయిన, మృతిచెందిన ఉద్యోగి కుటుంబాల పరామర్శ యాత్ర చేపడతామని వివరించారు. 18న కలెక్టరేట్‌ వద్ద సిపిఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ధర్నా చేపడతామని, ఈ కార్యక్రమాన్ని సిపిఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని సంఘాల వారు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా 20న ప్రతీ బ్యాంకుకు వెళ్లి మేనేజర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం వల్ల ఆ ఉద్యోగులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల నిమిత్తం ఇఎంఐలను సకాలంలో జమ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను బ్యాంక్‌ మేనేజర్లకు తెలిపి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ 25వ తేదీన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒకటో తేదీన పెన్షన్లు అందించడంలో విఫలమవడాన్ని నిరసిస్తూ 27న రిటైర్డ్‌ పెన్షనర్ల పరామర్శ యాత్ర, 29న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి జెఎసి జనరల్‌ సెక్రటరీ బి.రాంబాబు, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ ఎ.ప్రమోద్‌కుమార్‌, అమరావతి జెఎసి వైస్‌ఛైర్మన్‌ సిహెచ్‌.వర్మ, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వేణు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అధ్యక్ష, కార్యదర్శులు కమల్‌, సాయినాధ్‌, పెన్షనర్ల అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి మహాలక్ష్మి, వివిధ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.