ప్రజాశక్తి - ఆదోని
ఉద్యోగాలు ఇస్తామని పేపర్లలో ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. గురువారం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో సిఐ విక్రమ్ సింహా ఆధ్వరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతరాష్ట్ర స్థాయిలో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను సిఐ విక్రమ్ సింహా తన సిబ్బందితో అరెస్టు చేశారని తెలిపారు. ఇటీవల కర్నూలు నగరానికి చెందిన నాగ పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా అక్రమాలు వెలుగు చూశాయని చెప్పారు. నిందితులు కాలువ నరసింహులు, బెస్త సంజరు, శ్రీనివాసులు, మహ్మద్ సులేమాన్, డి.మహబూబ్ బాషను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. డీఎస్పీ వివరాల మేరకు... ఆదోని వన్ టౌన్ సిఐ విక్రమ సింహా, సిబ్బంది హక్ హాజీ బాష, రామచంద్ర, మహేశ్వరప్ప, లక్ష్మణ్‌లు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నవ భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటేడ్ అనే కంపెనీ పేరుతో ఫేక్ బ్రోచర్‌ను క్రియేట్ చేసి 'సాక్షి' దినపత్రికలో యాడ్ వేశారు. 'మా కంపెనీ ఎల్‌ఇడి బల్బులు ఇంటి వద్దనే ఉండి, ఫీట్ చేసి ఇవ్వడం ద్వారా నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చు' అని, వివరాలకు సంప్రదించాలని ఓ నెంబర్ ఇచ్చారు. ఎలాంటి ప్రూఫ్ లేకుండా 7 సిమ్ కార్డులు తీసుకుని ఈ నెంబర్లను ప్రకటనల్లో ఇస్తూ కస్టమర్లతో మాట్లాడేవారు. ప్రజల వద్ద వివిధ రకాల చార్జీల పేరిట, కిట్ చార్జీల పేరుతో విడతల వారీగా ఒక్కో వ్యక్తి నుంచి తక్కువ అంటే రూ.1050 నుంచి రూ.18 వేల వరకు ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవారు. వారికి పని కల్పించకుండా, ఎప్పటికప్పుడు సిమ్ కార్డులను మారుస్తూ 8 జిల్లాల నుంచి సుమారు 800 నుంచి 1000 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ.53 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. వాటి నుంచి సుమారు రూ.30.60 లక్షలను అవసరాలకు, విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఖర్చు చేశారు. నిందితులు, వారి సంబంధీకుల వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ.18.66 లక్షలను ఫ్రీజ్ చేయించి, నిందితులను టిజిఎల్ కాలనీ నుంచి మైనారిటీ కాలనీకి వెళ్లే దారిలో గల ఈద్గా వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, బ్యాంకు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివ నారాయణ స్వామి










