Jul 05,2023 23:59

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎ.రాజు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉద్యోగాల భర్తీలో ఇప్పటివరకు అమలు చేస్తున్న క్రీడల కోటాను రాష్ట్ర ప్రభుత్వం రద్దు ప్రతిపాదనను విరమించుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు సిహెచ్‌.శివాజీ, అల్లు రాజులు డిమాండ్‌ చేశారు. స్థానిక కార్మికకర్షక భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్‌ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనివల్ల ఎంతోమంది క్రీడాకారులు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా, అధికారులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో చేయడం తగదన్నారు. ఇప్పటివరకు మెడల్స్‌ సాధించిన వారికి ఎక్కువగా పోలీస్‌, రెవెన్యూ శాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్‌, రైల్వే, పోర్టులు వంటి వాటిల్లో ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. ఇకపై వారికి ఉద్యోగాల విధానానికి స్వస్తి పలికితే రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఆసక్తి చూపరని పేర్కొన్నారు. మెడల్స్‌ సాధించిన వారికి కేవలం ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం మాత్రమే అందించాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడమంటే క్రీడా కారులకు ద్రోహం చేయడమే అవుతుందన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు గంటా సురేష్‌, పాంగి చలపతి తదితరులు పాల్గొన్నారు.