బంగారు ఆభరణాలతో పరారైన వ్యక్తి అరెస్ట్
ప్రజాశక్తి -గాజువాక : ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, బంగారంతో పరారైన వ్యక్తిని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ ఎసిపి త్రినాధరావు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం, నర్సంపల్లికి చెందిన మజ్జి బుర్రమ్మ ఈ నెల 7న అనకాపల్లి బస్‌స్టాండ్ వద్ద ఉండగా, లంకెలపాలెం వాంబే కాలనీకి చెందిన బండారు రామ్‌చరణ్ కుమార్ ఆమెను పరిచయం చేసుకొని, ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. మాటలు నమ్మిన యర్రమ్మ నిందితునితో కలిసి గాజువాక వరకు ఆటోలో వచ్చింది. ఫొటో అవసరమని చెప్పి, గాజువాక ఆర్‌కె ఆసుపత్రి వద్ద ఫోటో తీసే క్రమంలో, మెడలో బంగారం ఉండకూడదని చెప్పి, మెడలో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం తీయించి, దాన్ని పట్టుకుని పరారయ్యాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు రామ్‌చరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే ఇలాంటివి 17కేసులున్నట్లు ఎసిపి వెల్లడించారు. పోలీసుల సస్పెక్ట్ షీట్‌ను ఓపెన్ చేశామన్నారు.










