ప్రజాశక్తి - ఏలూరు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషిచేయడం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. స్థానిక నరసింహారావు పేటలోని ఎస్‌ఎజి అకాడమీ నిర్వహించిన జాబ్‌మేళాలో పాల్గొని అభ్యర్థులకు పలు కార్పొరేట్ కంపెనీలు కల్పించిన ఉద్యోగావకాశాలకు సంబందించిన ఆఫర్ లెటర్లను ఆమె అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుందన్నారు. ఎస్‌ఎజి అకాడమీ వంటి సంస్థలు జాబ్‌మేళాలు ఏర్పాటుచేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అకాడమీ కార్యదర్శి కాట్రు బాలు మాట్లాడుతూ జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని, 556 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 250 మందికి జాబ్ ఆఫర్ లేఖలు అందించారన్నారు. మరో 50 మందికి దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో మొదటి విడతలో ఎంపికయ్యారని, వారికి మరో రెండు విడతల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. జాబ్ మేళాకు టెక్ మహీంద్రా, కాప్ జెమిని,హెటిరో, అరబిందో, జెంటాక్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ విష్ వంటి సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, వైసిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు పాల్గొన్నారు.










